కాంట్రవర్సీపై సాయిపల్లవి క్లారిటీ.. !
3/11/2026
లేటెస్ట్ కథానాయికల్లో సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హీరోయిన్ సాయిపల్లవి.. గత కొంతకాలంగా ఆమె తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఇంటర్వ్యూల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే వరుస వివాదాల నేపథ్యంలో ఈ నేచురల్ బ్యూటీ తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇకపై మాట్లాడే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని, తన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకుంటానని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్న వ్యాఖ్యలు!
సాయిపల్లవి అంటే ముందుగా గుర్తొచ్చేది ఆమె సహజమైన నటన. గ్లామర్‌కు దూరంగా ఉంటూ, కథకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఫిదా'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె.. 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగరాయ్', 'విరాటపర్వం', 'గార్గి', 'తండేల్' వంటి సినిమాలతో విజయాలను సాధించటమే కాకుండా నటిగా తనేంటో ప్రూవ్ చేసుకుంది. అయితే సినిమాల పరంగా ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో.. వ్యక్తిగతంగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ మాత్రం అంతే స్థాయిలో వివాదాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా 'విరాటపర్వం' ప్రమోషన్ల సమయంలో కశ్మీరీ పండిట్ల అంశం, మూకదాడుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆ తర్వాత భారత సైన్యానికి సంబంధించి ఆమె గతంలో మాట్లాడిన మాటలపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
'రామాయణ' ప్రమోషన్లలోనూ అదే పరిస్థితి!
ప్రస్తుతం సాయిపల్లవి నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'లో సీతాదేవి పాత్ర పోషిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో రావణుడి గురించి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి కారణమయ్యాయి. రావణుడిలోనూ కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయనే తాత్విక కోణంలో ఆమె మాట్లాడినప్పటికీ.. ఆ వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు, ట్రోలింగ్ మొదలయ్యాయి.
నా భావాలను సరిగ్గా చెప్పలేకపోతున్నా..!
వరుస వివాదాల నేపథ్యంలో తనలో మెరుగుపరుచుకోవాల్సిన అంశం ఏమిటనే ప్రశ్నకు సాయిపల్లవి ఆసక్తికరంగా స్పందించారు. తన మనసులో ఉన్న ఆలోచనలను ఎదుటివారికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడంలో కొంత ఇబ్బంది పడుతున్నానని అంగీకరించారు. తాను చెప్పాలనుకున్న విషయం ఒకటైతే.. అది బయటకు మరోలా అర్థమవుతోందని, దీనివల్ల అనవసరమైన గందరగోళం, వివాదాలు తలెత్తుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఒక నటిగా తన మాటలకు ఎక్కువ ప్రచారం లభిస్తుందని, అందుకే ప్రతి విషయంలోనూ మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నట్లు ఆమె తెలిపారు. తన కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇలా తనలో లోపాన్ని గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం మంచి పరిణామమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సీత పాత్రతో మరో కొత్త ప్రయాణం!
నవంబర్ 5న రిలీజ్ కానున్న 'రామాయణ: పార్ట్ 1'పై భారీ అంచనాలు ఉన్నాయి. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యష్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇలాంటి కీలక సమయంలో సాయిపల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారాయి. ఇప్పటివరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ నేచురల్ బ్యూటీ.. ఇకపై తన మాటల విషయంలోనూ మరింత జాగ్రత్తగా ఉంటానని చెబుతున్నారు. మరి ఈ నిర్ణయంతో వివాదాలకు దూరంగా ఉంటూ, తన సినిమాలపైనే దృష్టి పెడతారేమో చూడాలి!
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
