నా ప్రైవసీ వీడియోలు షేర్ చేస్తే ఊరుకోను.. సురేఖా వాణి ఫైర్!
9/11/2026

సోషల్ మీడియాలో తనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంపై నటి సురేఖా వాణి తీవ్రంగా స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని వెల్లడించిన ఆమె.. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తన అనుమతి లేకుండా ప్రైవేట్ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.
తెలుగు ప్రేక్షకులకు సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా కూతురు సుప్రీతతో కలిసి చేసే రీల్స్, డాన్స్ వీడియోలు, ఫొటోషూట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు.
తాజాగా సురేఖా వాణికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలపై రకరకాల ప్రచారాలు జరుగుతుండటంతో పాటు, వాటి వాస్తవికతపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సురేఖా వాణి నేరుగా స్పందిస్తూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్‌కు గురైందని తెలిపారు.
తన అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టి, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు, నెటిజన్లు ఎవరూ ఈ కంటెంట్‌ను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కేవలం వ్యూస్, రీచ్, పబ్లిసిటీ కోసం ఒకరి వ్యక్తిగత జీవితాన్ని వివాదంలోకి లాగొద్దని సూచించారు. అంతేకాదు.. తన ప్రైవేట్ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాలు, వ్యక్తులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని సురేఖా వాణి వెల్లడించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని, బాధ్యులపై సైబర్ క్రైమ్ కేసులతో పాటు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మరోవైపు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడటం, వారి అనుమతి లేకుండా ప్రైవేట్ సమాచారాన్ని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమనే చర్చ మరోసారి మొదలైంది. ఏదేమైనా తన ప్రైవసీని గౌరవించాలని సురేఖా వాణి చేసిన విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
