movies

14 ఏళ్లుగా అదే మాట‌.. నా వనవాసం ఎప్పటికి ముగుస్తుంది? పవన్ కళ్యాణ్‌పై రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

9/11/2026

14 ఏళ్లుగా అదే మాట‌.. నా వనవాసం ఎప్పటికి ముగుస్తుంది? పవన్ కళ్యాణ్‌పై రేణూ దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

న‌టి, డైరెక్ట‌ర్‌, నిర్మాత‌ రేణూ దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో విడిపోయి దాదాపు 14 ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ తనను ఆయన మాజీ భార్యగానే గుర్తించడం పట్ల ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకంటూ ఒక వ్యక్తిత్వం, కెరీర్ ఉన్నాయని.. వాటిని గుర్తించకుండా గతాన్నే ప్రస్తావిస్తూ ఉండటం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, విడాకుల తర్వాత ఎదురైన పరిస్థితులు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై రేణూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

పవన్ కళ్యాణ్‌తో విడాకులు జరిగి 14 ఏళ్లు పూర్తయినా.. ఇప్పటికీ తన జీవితాన్ని ఆ బంధంతోనే ముడిపెట్టి చూస్తున్నారని రేణూ దేశాయ్ అన్నారు. తెలుగు ప్రేక్షకుల దృష్టిలో తన జీవితం ‘బద్రి’ సినిమాతోనే మొదలైనట్లు భావిస్తున్నారని, అంతకుముందు తనకంటూ ఓ జీవితం, గుర్తింపు ఉన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. శ్రీరాముడి వనవాసం కూడా 14 ఏళ్లకే ముగిసిందని, మరి తన మానసిక వనవాసం ఎప్పుడు ముగుస్తుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

2012లో విడాకుల తర్వాత తాను ఖాళీగా కూర్చోలేదని రేణూ తెలిపారు. తన మాజీ భర్త సహాయం లేకుండానే సొంతంగా కెరీర్‌ను నిర్మించుకున్నానని చెప్పారు. విడాకుల తర్వాత ఓ మరాఠీ సినిమాను నిర్మించానని, మరో చిత్రానికి కథ రాయడంతో పాటు నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టానని వెల్లడించారు. డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించానని, కవితలు రాశానని, ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తున్నానని వివరించారు. ఇన్ని పనులు చేస్తున్న తనను ఇంకా ఒకరి మాజీ భార్యగానే ఎందుకు గుర్తిస్తున్నారంటూ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు తనను ‘వదిన’ అని పిలవడంపైనా రేణూ స్పందించారు. సాంకేతికంగా ఇప్పుడు తాను ఎవరికీ వదినను కాదని..ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటున్నానని చెప్పారు. అయితే అభిమానులు ప్రేమతో అమ్మ, అక్క లేదా వదిన అని ఎలా పిలుచుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. వారి భావాలను తాను నియంత్రించలేనని పేర్కొన్నారు. కాకపోతే వాస్తవానికి తనకు ఆ బంధం ఇప్పుడు లేదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు.

సోషల్ మీడియాలో ఎదురవుతున్న విమర్శలపై కూడా రేణూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఎన్జీవో ద్వారా వీధి కుక్కలకు వైద్యం అందిస్తూ, వాటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నా కొందరు ట్రోల్ చేస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ లేకపోతే తనకు జీవించే అర్హతే లేదన్నట్లుగా కొందరు కామెంట్స్ చేయడం బాధిస్తోందని అన్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే పిల్లలు అకీరా, ఆద్య పెంపకం విషయంలోనూ తనకు ఎదురవుతున్న విమర్శలను రేణూ ప్రస్తావించారు. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తల్లి పెంపకం సరిగా లేదంటూ తనను నిందిస్తారని, అదే వారు మంచి పనులు చేసినప్పుడు మాత్రం తాను బాగా పెంచానని ఎవరూ ప్రశంసించరని ఆవేదన వ్యక్తం చేశారు.

మొత్తానికి రేణూ దేశాయ్ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి సినిమాల్లో నటించి.. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో వేర్వేరు దారులు ఎంచుకున్న ఆమె.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్నారు. గతాన్ని పదేపదే గుర్తుచేస్తూ తనను అదే పరిధిలో చూడకుండా, నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తన ప్రయాణాన్ని కూడా గుర్తించాలని ఆమె కోరుకుంటున్నారు.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email