పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్స్ వెనుక రేణు దేశాయ్ కష్టం.. బాలు సినిమా ప్యాంట్‌పై ఇంట్రెస్టింగ్ సీక్రెట్!
5/11/2026

సినిమా హీరోల స్టైలింగ్ విషయంలో ఇప్పుడు ప్రత్యేకంగా కాస్ట్యూమ్ డిజైనర్లు, స్టైలిస్టులు పనిచేయడం కామన్. కానీ రెండు దశాబ్దాల క్రితమే హీరోల లుక్స్ విషయంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునేవారు కొందరు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోని కొన్ని బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ఆయన స్టైలిష్ లుక్స్ వెనుక మాజీ భార్య రేణు దేశాయ్ కృషి ఎంతో ఉంది. తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ నటించిన ‘బద్రి’, ‘ఖుషి’, ‘బాలు’ సినిమాల్లో ఆయన లుక్స్ అప్పట్లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పవన్ డ్రెస్సింగ్ స్టైల్ అప్పటి కుర్రాళ్లకు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా రేణు దేశాయ్ పనిచేశారు. పవన్ కోసం ప్రత్యేకమైన దుస్తులను ఎంపిక చేయడానికి ఆమె విదేశాలకు వెళ్లి మరీ షాపింగ్ చేసేవారట. ఈ క్రమంలో లండన్‌లో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం పవన్ సినిమాల కోసం కాస్ట్యూమ్స్ కొనడానికి తాను లండన్ వెళ్లేదాన్నని, అదే సమయంలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా అక్కడికి వచ్చేవారని వెల్లడించారు.
లండన్‌లోని ఓ భారీ షాపింగ్ మాల్లో తామిద్దరమే షాపింగ్ చేస్తుండేవాళ్లమని రేణు తెలిపారు. తాను పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ కోసం అక్కడికి వెళ్తే.. కరణ్ జోహార్ మాత్రం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కోసం దుస్తులు కొనడానికి వచ్చేవారట. పెద్ద దర్శక నిర్మాత అయిన కరణ్ జోహార్ స్వయంగా షారుఖ్ ఖాన్ కాస్ట్యూమ్స్ కోసం షాపింగ్ చేయడం తనకు ఆసక్తికరంగా అనిపించిందని రేణు గుర్తు చేసుకున్నారు. షారుఖ్‌పై ఉన్న అభిమానం, సినిమా పట్ల ప్రేమతో కరణ్ అలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకునేవారని ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి పవన్ కోసం రేణు.. షారుఖ్ కోసం కరణ్.. ఇద్దరూ తమ హీరోల లుక్స్ విషయంలో ఎంత కేర్ తీసుకునేవారో దీంతో తెలుస్తుంది.
ఇక పవన్ కళ్యాణ్ ‘బాలు’ సినిమాలో ఆయన ధరించిన ప్రత్యేకమైన ప్యాంట్ గురించి కూడా రేణు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ ప్యాంట్‌ను ఇటలీలోని మిలాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారట. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి క్లాత్‌తో కేవలం ఐదు ప్యాంట్లు మాత్రమే తయారు చేయగా.. వాటిలో ఒకదాన్ని పవన్ కోసం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అప్పట్లోనే ఆ ఒక్క ప్యాంట్ కోసం ఏకంగా రూ.75 వేలు ఖర్చు చేశారట. అంత మొత్తం ఒక ప్యాంట్ కోసం ఎందుకనే ప్రశ్నలు వచ్చినప్పుడు.. పవన్ ఐదు వేల రూపాయల విలువైన పది ప్యాంట్లు వేసుకోవడం కంటే, ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక్క ప్యాంట్‌పై అంత ఖర్చు చేయడం మంచిదని నిర్మాతను ఒప్పించారట రేణు. అప్పట్లో ఆ ప్యాంట్ కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని, ఇప్పటికీ దాని గురించి మాట్లాడుకుంటున్నారంటే తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం హీరోల లుక్స్, కాస్ట్యూమ్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న రోజులివి. కానీ రెండు దశాబ్దాల క్రితమే పవన్ కళ్యాణ్ సినిమాల కోసం రేణు దేశాయ్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ చూస్తుంటే ఆమె ఫ్యాషన్ సెన్స్, డెడికేషన్ ఏ స్థాయిలో ఉండేదో అర్థమవుతోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ పాత సినిమాల్లోని స్టైలిష్ లుక్స్ వెనుక ఇంత ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందనే విషయం రివీల్ అయ్యింది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
