movies

ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’.. మేకర్స్ టార్గెట్ ఏంటి!

12/11/2026

ఆస్కార్ బరిలోకి ‘రామాయణ’.. మేకర్స్ టార్గెట్ ఏంటి!

భారతీయ సినీ పరిశ్రమ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ పార్ట్ 1 ఆస్కార్ బరిలో నిలిచేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను 99వ అకాడమీ అవార్డుల పరిశీలనకు పంపినట్లు సమాచారం. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఈ చిత్రాన్ని పరిశీలనకు పంపినట్లు తెలుస్తోంది.

రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతమ్మగా నటించిన రామాయ‌ణ పార్ట్ 1 చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా దూసుకెళ్తోంది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో, భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక ఆకర్షణగా మెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ వేదికపై తమ సినిమాకు గుర్తింపు తీసుకురావాలని చిత్ర యూనిట్ త‌న‌వంతు ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించింది.

ఇదిలా ఉంటే.. 99వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో భారత్ తరఫున మరాఠీ సినిమా ‘గోంధల్’ అధికారికంగా ఎంపికైంది. అయితే ఒక సినిమా అధికారికంగా దేశం తరఫున ఎంపికైనంత మాత్రాన మిగిలిన భారతీయ చిత్రాలు ఆస్కార్‌లోని ఇతర విభాగాల్లో పోటీపడటానికి అడ్డంకి ఉండదు. అకాడమీ నిర్దేశించిన అర్హత ప్రమాణాలను అందుకుంటే ఏ దేశానికి చెందిన సినిమాలైనా ఆయా విభాగాల్లో పరిశీలనకు వెళ్లే అవకాశం ఉంటుంది.

మరోవైపు నాగాలాండ్ నేపథ్యంతో తెరకెక్కిన ‘అంఘ్’ చిత్రం కూడా అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పరిశీలనకు అర్హత సాధించడం విశేషం. ఈ పరిణామాల మధ్య ‘రామాయణ’ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ పరిశీలనకు వెళ్లడం భారతీయ సినిమాకు మరో ప్రత్యేకమైన గుర్తింపుగా చెప్పుకోవచ్చు. అయితే ఆస్కార్ పరిశీలనకు సినిమా వెళ్లడం అంటే నామినేషన్ ఖరారైనట్లు కాదు. తుది జాబితాలో చోటు దక్కించుకుంటుందా? అంతర్జాతీయ చిత్రాల మధ్య పోటీలో విజయం సాధిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email