నయనతార, రష్మికలకు అసలైన బాక్సాఫీస్ టెస్ట్.. సోలోగా సత్తా చాటుతారా?
4/11/2026

స్టార్ హీరోలతో జతకడితే హీరోయిన్లకు వచ్చే క్రేజ్ వేరు. అదే సొంతంగా సినిమాను భుజాలపై వేసుకుని నడిపించాల్సి వస్తే లెక్కలు మారిపోతాయి. స్టార్ హీరోల ఇమేజ్, ఫ్యాన్ బేస్ లేకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇద్దరు క్రేజీ హీరోయిన్లు ఇదే టెస్ట్ ఎదుర్కోబోతున్నారు. ఒకరు లేడీ సూపర్ స్టార్ నయనతార కాగా.. మరొకరు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ నవంబర్‌లో వీరిద్దరూ తమ సోలో సినిమాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నారు. ఇంతకీ ఆ సినిమాలేంటనే సంగతిలోకి వెళితే..
నయనతార నటించిన ‘మహాశక్తి’ నవంబర్ 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే లేడీ సూపర్ స్టార్‌గా సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నయన్.. గతంలోనూ ఎన్నో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే తమిళంలో ఆమెకున్న మార్కెట్ వేరు.. తెలుగులో ఆమె సోలో సినిమాలకు ఉండే ఆదరణ వేరు. అందుకే ‘మహాశక్తి’తో తెలుగు ఆడియన్స్‌ను ఎంతవరకు థియేటర్లకు రప్పించగలరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా నయనతార తెలుగు సోలో మార్కెట్‌కు ఒక పరీక్షగా నిలవనుంది.
ఇక రష్మిక మందన్న విషయానికి వస్తే.. స్టార్ హీరోల సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు ‘మైసా’తో పూర్తిగా భిన్నమైన ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇందులో గోండు గిరిజన మహిళగా కనిపించడమే కాకుండా, యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. నవంబర్ 27న ఐదు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
అయితే రష్మికకు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ ఈ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుందనేది చూడాలి. ఇప్పటివరకు స్టార్ హీరోలతో కలిసి అందుకున్న విజయాలకు, తనే ప్రధాన పాత్రలో నటించిన సినిమాకు వచ్చే ఓపెనింగ్స్‌కు చాలా తేడా ఉంటుంది. పైగా ‘మైసా’ విడుదల తేదీ విషయంలోనూ కొంత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.
ఇక ‘మైసా’కు మరో సవాల్ కూడా ఎదురుకానుంది. అదే తేదీకి ‘హైందవ’ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర పోటీ తప్పేలా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కంటెంట్‌తో పాటు ప్రమోషన్స్, రిలీజ్ టైమింగ్ కూడా కీలకంగా మారనున్నాయి. నయనతార ఇప్పటికే సోలో సినిమాలతో తన మార్కెట్‌ను పలుమార్లు పరీక్షించుకున్నారు. రష్మికకు మాత్రం ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా క్రేజ్‌ను సొంత సినిమాకు ఉపయోగించుకునే మంచి అవకాశం దక్కింది. ఇద్దరికీ స్టార్డమ్ ఉంది.. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ అవన్నీ టికెట్ కౌంటర్ల దగ్గర ఎంతవరకు పనిచేస్తాయన్నదే అసలైన ప్రశ్న.
మరి ఈ నవంబర్ బాక్సాఫీస్ టెస్ట్‌లో నయనతార ‘మహాశక్తి’, రష్మిక ‘మైసా’ సినిమాలు ఎలాంటి ఓపెనింగ్స్ రాబడతాయి? హీరోయిన్ల ఇమేజ్‌తోనే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలరా? వేచి చూడాలి!
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
