movies

16 ఏళ్ల తర్వాత అదే తేదీన నాగ్ సినిమా.. మ్యాజిక్ జ‌రిగేనా!

3/11/2026

16 ఏళ్ల తర్వాత అదే తేదీన నాగ్ సినిమా.. మ్యాజిక్ జ‌రిగేనా!

అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎన్నో ప్రత్యేకమైన సినిమాలు ఉన్నాయి. వాటిలో ‘రగడ’ కూడా ఒకటి. 2010లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మరోసారి నాగార్జున 100వ‌సినిమా విడుదల తేదీ విషయంలో ‘రగడ’తో ఓ ఆసక్తికరమైన పోలిక కనిపిస్తోంది. అదేంట‌నే వివ‌రాల్లోకి వెళితే..

2010 ఏడాదిలో డిసెంబర్ 24న విడుదలైన ‘రగడ’ సినిమాలో నాగార్జున మాస్ యాక్షన్ అవతార్‌లో కనిపించారు. ఇప్పుడు అదే డిసెంబర్ 24న, 2026లో తన కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన త‌న 100వ సినిమా.. ‘కింగ్ 100’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఈ రిలీజ్ డేట్ అక్కినేని అభిమానులకు మరింత స్పెషల్‌గా మారింది.

16 ఏళ్ల తర్వాత మళ్లీ అదే మ్యాజిక్!
నాగార్జున హీరోగా వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రగడ’ సినిమాలో అనుష్క శెట్టి, ప్రియమణి హీరోయిన్లుగా నటించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా 2010 డిసెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది. మాస్ యాక్షన్, కామెడీ అంశాలతో రూపొందిన ఈ సినిమా నాగార్జున అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సరిగ్గా 16 ఏళ్ల తర్వాత అదే తేదీకి నాగార్జున తన ‘కింగ్ 100’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆర్.ఏ. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు.

కింగ్ 100లో స్పెషాలిటీస్..!
ఈ సినిమాలో నాగార్జునను సరికొత్త అవతార్‌లో చూపించబోతున్నారు. డబ్బు, అధికారం, గుర్తింపు చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. భారీ స్కామ్, అల్లర్లు, యాక్షన్ సన్నివేశాలతో సినిమాపై ఆసక్తిని పెంచారు. మరోవైపు చాలా కాలం తర్వాత నాగార్జున, టబు కలిసి నటిస్తుండటం కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

యాదృచ్ఛికమా.. ప్రత్యేక సెంటిమెంటా?
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకే తేదీకి సినిమాలను విడుదల చేయడం, గతంలో హిట్ అయిన తేదీలను మరోసారి ఎంచుకోవడం వంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే ‘రగడ’ విడుదలైన తేదీనే ఇప్పుడు తన 100వ సినిమాకు కూడా నాగార్జున ఎంచుకోవడం మాత్రం ఆసక్తికరంగా మారింది. అప్పుడు ‘రగడ’తో ప్రేక్షకులను పలకరించిన నాగ్.. ఇప్పుడు ‘కింగ్ 100’తో తన కెరీర్‌లో మరో మైలురాయిని అందుకోబోతున్నారు. మరి 16 ఏళ్ల క్రితం అదే తేదీకి వచ్చిన ‘రగడ’ ఇచ్చిన ఫలితాన్ని ఇప్పుడు ‘కింగ్ 100’ కూడా రిపీట్ చేస్తుందా? అన్నది చూడాలి. మొత్తానికి అక్కినేని అభిమానులకు డిసెంబర్ 24న ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోనుంది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email