movies

మ‌న సంస్కృతిని నార్త్‌లో త‌క్కువ చేసి మాట్లాడ‌ను..సౌత్ సినిమాపై రాధికా ఆప్టే కాంట్ర‌వ‌ర్సీపై కీర్తి సురేష్ క్లారిటీ!

19/11/2026

మ‌న సంస్కృతిని నార్త్‌లో త‌క్కువ చేసి మాట్లాడ‌ను..సౌత్ సినిమాపై రాధికా ఆప్టే కాంట్ర‌వ‌ర్సీపై కీర్తి సురేష్ క్లారిటీ!

సినిమాల్లో చూపించే కథలు, పాత్రల గురించి అప్పుడప్పుడు నటీనటులు చేసే వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తుంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ నటి రాధికా ఆప్టే, దక్షిణాది హీరోయిన్ కీర్తి సురేష్. తెలుగు సినిమాల్లో మేనరికం పెళ్లిళ్లు, హీరోలతో హీరోయిన్ల రొమాన్స్ అంశాలపై రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వివాదంలో కీర్తి సురేష్ పేరు కూడా వినిపించడంతో తాజాగా ఆమె స్పందించారు.

ఇటీవల ‘అక్క’ వెబ్ సిరీస్ ప్రమోషన్ల సమయంలో రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో దక్షిణాది సినిమాల్లో తనకు ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. తనకంటే ఎక్కువ వయసున్న హీరోతో రొమాన్స్ చేయడం, సినిమాలో మేనమామను పెళ్లి చేసుకునే సన్నివేశాల్లో నటించడం తనకు ఇబ్బందిగా అనిపించిందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో పలువురు తెలుగు సినీ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె చెప్పిన సినిమా బాలకృష్ణ హీరోగా నటించిన ‘లెజెండ్’ అంటూ కూడా చర్చ జరిగింది.

అయితే ఈ వివాదంపై తాజాగా కీర్తి సురేష్ స్పందించారు. తన కొత్త సినిమా ‘సత్యవాన్ సావిత్రి’ ప్రమోషన్లలో భాగంగా జరిగిన మీడియా సమావేశంలో ఈ అంశంపై ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా.. రాధికా ఆప్టే మామయ్యను పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పినప్పుడు మొదట ఆమె ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో తనకు అర్థం కాలేదని కీర్తి వివరించారు. ఆ తర్వాత అది దక్షిణాదిలోని మేనరికం సంప్రదాయం గురించి అని తెలుసుకున్నానని చెప్పారు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి వివాహ సంప్రదాయాలు ఉన్నాయని, కేరళలో మాత్రం ఈ పద్ధతి లేదని తనకు తెలుసునని పేర్కొన్నారు. కర్ణాటకలో కూడా ఈ ఆచారం ఉందో లేదో తనకు తెలియదన్నారు. ఉత్తరాది వారికి దక్షిణాది సంప్రదాయాల గురించి తెలియకపోవచ్చని, అందుకే వాటి గురించి వివరించే ప్రయత్నం మాత్రమే చేశానని తెలిపారు. అంతేకానీ మన సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం తనకు ఎప్పటికీ లేదని స్పష్టం చేశారు.

అయితే కీర్తి ఇచ్చిన ఈ వివరణపై కూడా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం అప్పట్లో రాధికా ఆప్టే వ్యాఖ్యలకు మద్దతుగా మాట్లాడినట్లుగా కనిపించి, ఇప్పుడు విమర్శలు రావడంతో వివరణ ఇస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇప్పుడు కీర్తి సురేష్ వివరణతో మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం నవంబర్ 20న విడుదల కానున్న 'సత్యవాన్ సావిత్రి' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న కీర్తికి ఈ వివాదం కూడా చర్చనీయాంశంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email