క్రేన్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కాజల్.. ఏం జరిగిందో చెప్పిన హీరోయిన్
13/11/2026

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత భయానక సంఘటనను తాజాగా గుర్తుచేసుకున్నారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన భారీ క్రేన్ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించారు. దాదాపు ఆరేళ్ల క్రితం అంటే 2020లో జరిగిన ఈ ఘటన గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న కాజల్.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘రామాయణ’ సినిమాలో మండోదరి పాత్ర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తనకు ఎదురైన ప్రమాదం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 2020లో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ సమయంలో చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో భారీ ప్రమాదం జరిగింది. దాదాపు 100 అడుగుల ఎత్తున్న క్రేన్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ముగ్గురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఆ సమయంలో కాజల్ కూడా షూటింగ్ సెట్లోనే ఉన్నారు.
ఆ రోజు తాను 80 ఏళ్ల వృద్ధురాలి పాత్ర కోసం ప్రత్యేక ప్రోస్థెటిక్ మేకప్ వేసుకున్నానని కాజల్ గుర్తుచేసుకున్నారు. సెట్లో మానిటర్ దగ్గర కూర్చుని ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం, కేకలు వినిపించాయని తెలిపారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే భారీ క్రేన్ కూలిపోయిందని చెప్పారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసే క్రమంలో టేబుల్‌ను ఢీకొని కిందపడిపోయినట్లు వెల్లడించారు. అయితే ఆ క్రేన్ తనవైపే కూలాల్సి ఉందని, కొన్ని సెకన్ల తేడాతో ప్రమాదం నుంచి బయటపడ్డానని తెలిపారు. ఆ సంఘటనను ఇప్పటికీ తలుచుకుంటే భయంగా ఉంటుందని భావోద్వేగానికి గురయ్యారు.
ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదానికి వారం రోజుల ముందే సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నానని కాజల్ తెలిపారు. కెరీర్లో ఎంతో సంతోషాన్ని ఇచ్చిన ఆ సందర్భం తర్వాత ఇంతటి భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఆ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటం తనకు మరో జన్మ లాంటిదని ఆమె వ్యాఖ్యానించారు. ఒకవైపు కెరీర్లో అరుదైన గుర్తింపు.. మరోవైపు కళ్లముందే చోటుచేసుకున్న ప్రాణాంతక ప్రమాదం.. ఈ రెండింటినీ కేవలం వారం రోజుల వ్యవధిలో ఎదుర్కోవడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవమని కాజల్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
