movies

ఒకేరోజు.. తండ్రి Vs కొడుకు .. అదిరిపోయే క్లాష్!

16/11/2026

ఒకేరోజు.. తండ్రి Vs కొడుకు .. అదిరిపోయే క్లాష్!

సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య బాక్సాఫీస్ పోటీలు కామనే. కానీ ఇప్పుడు జరగబోతున్న క్లాష్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకులు ఒకే రోజున థియేటర్లలో పోటీ పడబోతున్నారు. మరో విశేషం ఏంటంటే.. ఇద్దరూ తమ సొంత భాషలో కాకుండా వేర్వేరు ఇండస్ట్రీల్లో రూపొందిన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ స్టార్ తండ్రీకొడుకుల బాక్సాఫీస్ ఫైట్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది.

మలయాళంలో స్టార్ హీరోగా కొనసాగుతూనే తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తూ ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్. తాజాగా ఆయన దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న ఆకాశంలో ఒక తార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. వైజయంతీ మూవీస్, గీతా ఆర్ట్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటంతో సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. దుల్కర్ నుంచి మరో డిఫరెంట్ మూవీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మరోవైపు దుల్కర్ తండ్రి, లెజెండరీ నటుడు మమ్ముట్టి కూడా అదే రోజున బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ధనుష్ హీరోగా అమరన్ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓం చిత్రంలో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ తమిళ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్ కావడంతో కోలీవుడ్ ప్రేక్షకుల్లోనూ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరిగింది.

ఇక్కడే ఈ బాక్సాఫీస్ క్లాష్‌లో అసలైన ప్రత్యేకత ఉంది. మలయాళానికి చెందిన తండ్రీకొడుకులు ఇద్దరూ తమ మాతృభాషలో కాకుండా ఇతర భాషల సినిమాలతో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దుల్కర్ తెలుగు సినిమాతో టాలీవుడ్‌లో సందడి చేయబోతుంటే.. మమ్ముట్టి తమిళ చిత్రంతో కోలీవుడ్‌లో తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా తండ్రి, కొడుకుల సినిమాలు ఒకే సమయంలో విడుదల కావడం అరుదు. అలాంటిది వేర్వేరు భాషల్లో ఒకే తేదీన రావడం మరింత ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో ప్రత్యేకమైన క్యూరియాసిటీ నెలకొంది. మొత్తానికి నవంబర్ 20న సౌత్ బాక్సాఫీస్ దగ్గర తండ్రీకొడుకుల సందడి స్పెషల్ అట్రాక్షన్ కానుంది!

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email