చిరంజీవి కలను నిజం చేసిన రామ్ చరణ్.. IFFI 2026 సందర్భంగా 20 ఏళ్ల నాటి వీడియోవైరల్!
22/11/2026

తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని చెప్పడానికి మరో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు గోవాలో జరుగుతున్న 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2026)లో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ వేడుకల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెలబ్రిటీ గ్యాలరీలో ప్రపంచ సినీ దిగ్గజాల సరసన రామ్ చరణ్ చిత్రపటాన్ని ప్రదర్శించడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘనత వెనుక ఒక ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వ్యక్తం చేసిన ఆవేదన ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చింది. గోవాలో జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినీ ప్రముఖుల ఫొటోలు కనిపిస్తున్నాయని, కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మహానటుల చిత్రాలు అక్కడ లేకపోవడం బాధ కలిగిస్తోందని అప్పట్లో చిరంజీవి వ్యాఖ్యానించారు.
అయితే రెండు దశాబ్దాల తర్వాత అదే గోవా వేదికపై ఆయన తనయుడు రామ్ చరణ్ ఫొటోకు చోటు దక్కడం విశేషం. ఒకప్పుడు తెలుగు సినిమా తరఫున చిరంజీవి వ్యక్తం చేసిన ఆవేదనకు.. నేడు రామ్ చరణ్ సాధించిన ఈ గుర్తింపు సమాధానంగా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి కోరుకున్న గౌరవం తనయుడి రూపంలో తెలుగు సినిమాకు దక్కిందంటూ మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
IFFI వేడుకల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెలబ్రిటీ గ్యాలరీలో రామ్ చరణ్ చిత్రపటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, దేవానంద్ వంటి భారతీయ సినీ దిగ్గజాలతో పాటు హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్, నటి ఏంజెలినా జోలీ చిత్రపటాల సరసన చరణ్ ఫొటోను ప్రదర్శించారు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్‌కు ఈ స్థాయి గౌరవం దక్కడం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయంతో తెలుగు సినిమా మార్కెట్, గుర్తింపు రెండూ కొత్త స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు అదే ప్రభావం మరోసారి ఇఫీ వేదికపై కనిపిస్తోంది.
‘స్టోరీస్ వితౌట్ బోర్డర్స్’ అనే థీమ్‌తో నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో 57వ ఇఫీ వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 86 దేశాలకు చెందిన 150కి పైగా అంతర్జాతీయ చిత్రాలతో పాటు 76 భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి రెండు దశాబ్దాల క్రితం చిరంజీవి వ్యక్తం చేసిన ఆవేదనను గుర్తుచేసేలా ఇప్పుడు రామ్ చరణ్‌కు దక్కిన ఈ అరుదైన గుర్తింపు నిలిచింది. ఇది కేవలం మెగా కుటుంబానికి మాత్రమే కాదు.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పే మరో ప్రత్యేక సందర్భమనే చెప్పాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
