‘దాదా’ రిలీజ్ విషయంలో వాయిదా మాటే లేదంటున్న బాలయ్య
6/11/2026

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దాదా’పై టాలీవుడ్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే ఇటీవల బాలయ్యకు జరిగిన ప్రమాదం కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. దీంతో అనుకున్న సమయానికి సినిమా విడుదల అవుతుందా? లేదా వాయిదా పడుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. తాజాగా ఈ ప్రచారానికి చిత్రబృందం చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.
నిజానికి ‘దాదా’ చిత్రాన్ని డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ముందుగానే నిర్ణయించారు. అయితే బాలకృష్ణ గాయపడటంతో షూటింగ్ షెడ్యూల్స్‌లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఆయన కోలుకుని తిరిగి షూటింగ్లో పాల్గొంటున్నప్పటికీ, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రబృందం జాగ్రత్తగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా మార్చి నెలకు వాయిదా పడుతుందనే ప్రచారం మొదలైంది. కానీ డిసెంబర్ 24 విడుదల తేదీ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచన లేదని యూనిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే పలు సినిమాలు ఉండటంతో జనవరిలో విడుదలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి కూడా పెద్ద హీరోల సినిమాలకు అంతగా అనుకూలమైన సీజన్ కాదనే అభిప్రాయం ఉంది. ఇక మార్చి, ఏప్రిల్ నెలల్లో భారీ పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వాటి మధ్యలో విడుదల తేదీని వెతుక్కోవడం కంటే ముందుగా అనుకున్న ప్రకారమే డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రావడం మంచిదని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
దాదా సినిమాలో లో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. బాలకృష్ణ, మంచు మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పైకి మాఫియా కథలా కనిపించినా సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే మరికొన్ని అంశాలు ఉన్నాయని టాక్.
మరోవైపు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల తేదీపై స్పష్టత ఇచ్చిన మేకర్స్‌కు ఇప్పుడు చేతిలో ఉన్నది తక్కువ సమయమే. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాల్సి ఉంది. మరి బాలయ్య తన మాస్ పవర్‌తో ఈ క్రిస్మస్కు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి చేస్తారో చూడాలి మరి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
