movies

అల్లు అర్జున్ దుబాయ్ ప్లాన్‌కు బ్రేక్.. హైదరాబాద్‌కు ‘రాకా’ టీమ్..కారణమదేనా!

3/11/2026

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న‌ భారీ చిత్రం ‘రాకా’. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో కీలక మార్పు చోటుచేసుకున్నట్లు సమాచారం. తొలుత దుబాయ్‌లో ప్లాన్ చేసిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను ఇప్పుడు హైదరాబాద్‌లోనే చిత్రీకరించాలని దర్శకుడు అట్లీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు ఎందుకంటే?

‘రాకా’ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను దుబాయ్‌లో చిత్రీకరించాలని అట్లీ మొదట భావించారట. అయితే ప్రస్తుతం అక్క‌డ‌ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అనిశ్చితి నేపథ్యంలో దుబాయ్ షూటింగ్ ప్లాన్‌ను విరమించుకున్నట్లు సమాచారం. దుబాయ్‌లో తీయాలనుకున్న సన్నివేశాలను హైదరాబాద్‌లోనే తెరకెక్కించాలని నిర్ణయించారట. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

తొలిసారి హైదరాబాద్‌లో షూటింగ్..

ఇప్పటివరకు ‘రాకా’ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగం ముంబైలోనే జరిగింది. ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్‌లో చిత్రీకరణ కొనసాగుతోంది. ఇప్పుడు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో జరగనున్న తొలి షూటింగ్ షెడ్యూల్ ఇదే కావడం విశేషం. ఈ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుండటం అల్లు అర్జున్‌కు కూడా కొంత వెసులుబాటు కలిగించనుంది. తరచూ ముంబైకి ప్రయాణాలు చేయాల్సిన అవసరం తగ్గనుంది. మరోవైపు రాబోయే నెలల్లో విదేశీ షెడ్యూల్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

భారీ తారాగణంతో ‘రాకా’..

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా ఈ సినిమాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వీరి భాగస్వామ్యంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. స‌న్ పిక్చ‌ర్స్ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ప్రీ లుక్, ఇతర అప్‌డేట్స్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. అట్లీ తనదైన స్టైల్‌లో భారీ యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి హైదరాబాద్‌లో జరగనున్న యాక్షన్ షెడ్యూల్‌లో అల్లు అర్జున్ ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఇవ్వబోతున్నారో చూడాలి మ‌రి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email