రియల్ లైఫ్‌లోనూ హిట్టే.. .. తుఫాను బాధితులకు అండగా ‘టాలీవుడ్ డైరెక్టర్!
2/11/2026
సినిమాల్లో ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్లను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను.. నిజ జీవితంలోనూ తన మంచి మనసును చాటుకున్నారు. ప్రకృతి విపత్తుతో కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అర్నాబ్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన కాకినాడ పరిసర ప్రాంతాల్లో బాధిత కుటుంబాలకు సహాయం అందించారు. వందలాది మంది యువతతో కలిసి సహాయక కార్యక్రమాల్లో పాల్గొని పలువురి ప్రశంసలు అందుకుంటున్నారీ డైరెక్టర్.
బాధితుల కోసం క్షేత్రస్థాయిలోకి..
అర్నాబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇళ్లు, పంటలు, రహదారులు దెబ్బతిన్నాయి. చాలా కుటుంబాలు తమకు అవసరమైన నిత్యావసర వస్తువులు కూడా కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో దర్శకుడు శైలేష్ కొలను బాధితులకు తన వంతు సాయం అందించాలని నిర్ణయించుకున్నారు.
కాకినాడ ప్రాంతంలో స్వయంగా సహాయక కార్యక్రమాలను చేపట్టారు. తన పిలుపుతో ముందుకొచ్చిన వందలాది మంది యువతీ యువకులు, స్థానికులతో కలిసి బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, తాగునీరు, ఇతర అత్యవసర సామగ్రిని పంపిణీ చేశారు. కేవలం సోషల్ మీడియాలో స్పందించి వదిలేయకుండా.. స్వయంగా ప్రజల మధ్యకు వెళ్లి వారికి అండగా నిలవడం ప్రత్యేకంగా నిలిచింది.
అధికారుల పనితీరుపై కూడా ప్రశంసలు..
తుఫాను సమయంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు సహాయక చర్యలు చేపట్టిన జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది, ఇతర అధికారుల కృషిని కూడా శైలేష్ కొలను అభినందించారు. విపత్తు సమయంలో ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యలను తన సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు.
సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం..
శైలేష్ కొలను చేపట్టిన సహాయక కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నారని కామెంట్లు చేస్తున్నారు.
ఒకవైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ శైలేష్ కొలను చూపిస్తున్న సామాజిక బాధ్యత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజమైన హీరోయిజం తెరపై మాత్రమే కాదు.. అవసరమైన సమయంలో తోటి మనుషులకు అండగా నిలవడంలోనూ ఉంటుందని ఆయన నిరూపించారని పలువురు అభినందిస్తున్నారు.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
