కోలీవుడ్‌పై జాన్వీ కపూర్ ఫోకస్!..టాలీవుడ్లో ఇక ఛాన్స్‌లు లేనట్టేనా?
9/11/2026

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌కు దక్షిణాది సినిమాలపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ముఖ్యంగా టాలీవుడ్లో ఎన్టీఆర్‌తో ‘దేవర’, రామ్ చరణ్‌తో ‘పెద్ది’ సినిమాలు చేసిన ఆమె.. ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశించారు. అయితే ఈ రెండు సినిమాల విషయంలో ఆమె పాత్రలపై వచ్చిన విమర్శలు, తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీయడంతో ఇప్పుడు జాన్వీ కెరీర్‌పై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆమె చూపు కోలీవుడ్‌పై పడిందనే టాక్ వినిపిస్తోంది.
తాజాగా తన పిన్ని, సీనియర్ నటి మహేశ్వరితో కలిసి ఓ చిట్‌చాట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. తమిళ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇటీవల ‘బ్లాస్ట్’ అనే తమిళ సినిమా చూశానని, అందులో ప్రీతి ముకుందన్ నటన నచ్చిందని తెలిపారు. అంతేకాదు, మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ పాటలకు తాను పెద్ద అభిమానినని చెప్పారు. దర్శకుడు వెట్రిమారన్ సినిమాలంటే తనకు ప్రత్యేకమైన ఇష్టమని, విజయ్ నటించిన ‘పోకిరి’ వంటి కమర్షియల్ సినిమాలను కూడా ఇష్టపడతానని వెల్లడించారు. తన తండ్రి బోనీ కపూర్ నిర్మించిన రీమేక్ చేసిన దక్షిణాది సినిమాలను కూడా చూస్తుంటానని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో తమిళ సినీ ప్రేక్షకుల దృష్టి జాన్వీపై పడింది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’తో తెలుగు తెరకు పరిచయమైన జాన్వీకి ఆ సినిమాలో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన ‘పెద్ది’లో నటించినప్పటికీ, ఆమె పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ముఖ్యంగా హీరోయిన్ను గ్లామర్‌కే పరిమితం చేస్తున్నారనే విమర్శలు వినిపించాయి. ఇక ఇటీవల ఓ టాక్ షోలో తెలుగు సినిమా షూటింగ్ విధానం..స్క్రిప్ట్ విషయంలో చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి. దీంతో తెలుగు ప్రేక్షకుల్లో ఒక వర్గం ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్లో జాన్వీకి కొత్త అవకాశాలు తగ్గుతాయా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
తమిళ సినిమాలపై జాన్వీ చూపిస్తున్న ఆసక్తి వెనుక కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉందా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అక్కడి దర్శకులు, సినిమాలు, సంగీతంపై ఆమె ప్రశంసలు కురిపించడం చూస్తుంటే తమిళ చిత్ర పరిశ్రమలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జాన్వీ తమిళ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారిక ప్రకటన ఏదీ లేదు. ఆమె వ్యాఖ్యలను బట్టి మాత్రమే కోలీవుడ్ ఎంట్రీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి టాలీవుడ్లో వరుస సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కని జాన్వీ.. ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమపై ఆసక్తి చూపించడం హాట్ టాపిక్‌గా మారింది. మరి నిజంగానే కోలీవుడ్‌లో కొత్త ప్రయాణం మొదలుపెడతారా? లేక ఇవన్నీ యాదృచ్ఛిక వ్యాఖ్యలేనా? అనేది చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
