movies

22 ఏళ్ల తర్వాత.. క‌మ‌ల్ హాస‌న్ ‘సండియర్’ టైటిల్ కాంట్ర‌వ‌ర్సీ

9/11/2026

22 ఏళ్ల తర్వాత.. క‌మ‌ల్ హాస‌న్ ‘సండియర్’ టైటిల్ కాంట్ర‌వ‌ర్సీ

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవ‌ల ఆయ‌న తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ‘సండియ‌ర్‌’కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈసారి సినిమా టైటిల్‌తో హాట్ టాపిక్‌గా మారారు. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘సండియర్’ అనే పేరు పెట్టడంతో తమిళనాట వివాదానికి కార‌ణ‌మైంది. గతంలో ఇదే పేరుని త‌న సినిమాకు పెట్టిన‌ప్పుడు పెద్ద దుమార‌మే చేల‌రేగింది. అయితే ఆయ‌న‌ మళ్లీ అదే టైటిల్‌ను తెరపైకి తీసుకురావడంపై పుదియ తమిళగం పార్టీ అధినేత డాక్టర్ కె. కృష్ణస్వామి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

తమిళనాట ‘సండియర్’ అనే పదానికి సాధారణంగా గొడవలకు దిగే వ్యక్తి, వీధుల్లో గొడ‌వ‌లు ప‌డేవాడు అనే అర్థాలున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పదాన్ని కుల ఆధిపత్యం, అణగారిన వర్గాలపై దౌర్జన్యాలకు ప్రతీకగా కూడా చూస్తుంటారు. దీంతో ఈ టైటిల్ ఒక వర్గం ఆధిపత్యాన్ని ప్రోత్సహించేలా ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. నిజానికి 2004లోనే కమల్ హాసన్ ఈ టైటిల్ విషయంలో పెద్ద వివాదాన్ని ఎదుర్కొన్నారు. అప్పట్లో తన సినిమా ‘విరుమాండి సండియర్’ అనే పేరు పెట్టారు. చేతిలో కొడవలి పట్టుకున్న కమల్ పోస్టర్ కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. డాక్టర్ కృష్ణస్వామి నేతృత్వంలో నిరసనలు జరగడంతో పాటు, ఈ పేరు కులపరమైన ఉద్రిక్తతలకు కారణమవుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి జయలలిత జోక్యం త‌ర్వాత చివరకు టైటిల్‌ను ‘విరుమాండి’గా మార్చాల్సి వచ్చింది.

ఇప్పుడు దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పేరును తీసుకురావడంపై కృష్ణస్వామి మ‌ళ్లీ స్పందించారు. కమల్ హాసన్ అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించడంతో పాటు..‘సండియర్’ టైటిల్‌ను కొనసాగిస్తే ఆయన తమిళనాడును తరచూ విడిచి వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చంటూ హెచ్చరించారు. మొత్తానికి సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2004లో జరిగిన వివాదం మళ్లీ రిపీట్ అవుతుందా? ఈసారి కమల్ హాసన్ టైటిల్ విషయంలో వెనక్కి తగ్గుతారా? లేక అదే పేరుతో ముందుకు వెళ్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email