movies

శర్వానంద్ ‘భోగి’ వాయిదా ప‌డ‌నుందా.. ట్రైల‌ర్ అందుకే రిలీజ్ చేయ‌లేదా!

9/11/2026

శర్వానంద్ ‘భోగి’ వాయిదా ప‌డ‌నుందా.. ట్రైల‌ర్ అందుకే రిలీజ్ చేయ‌లేదా!

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో శర్వానంద్‌కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోగి’ విడుదల వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. నవంబర్ 12న థియేటర్లలోకి రావాల్సిన ఈ సినిమా ప్రమోషన్స్‌కు అనూహ్యంగా బ్రేక్ పడటంతో రిలీజ్ డేట్‌పై సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు ఉండగా, చివరి నిమిషంలో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ సినిమా ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 7న హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే అనూహ్యంగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ కార్యక్రమాన్ని చివరి నిమిషంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త తేదీని త్వరలో వెల్లడిస్తామని దర్శకుడు సంపత్ నంది తెలిపారు. అయితే సినిమా విడుదలకు పట్టుమని ఐదు రోజులు కూడా లేని సమయంలో ట్రైలర్ ఈవెంట్ వాయిదా పడటంతో అసలు సినిమా అనుకున్న తేదీకి వస్తుందా? అనే చర్చ మొదలైంది.

నవంబర్ నెలలో వరుసగా సినిమాలు థియేటర్లలోకి క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా వచ్చే వారం పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో థియేటర్ల దగ్గర పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘భోగి’ని రిలీజ్ చేస్తే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవచ్చనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

మరో విడుదల తేదీని ఎంచుకోవాలని చిత్రబృందం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు వాయిదాపై అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఈ సినిమా నవంబర్ 12నే వస్తుందా? లేక కొత్త డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి ముందుగా ‘భోగి’ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా నవంబర్‌కు వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి విడుదల తేదీ మారే పరిస్థితులు కనిపిస్తుండటంతో శర్వానంద్ అభిమానుల్లో కొంత నిరాశ నెలకొంది.

ఈ సినిమాలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ‘భోగి’ విడుదల విషయంలో నెలకొన్న ఈ సస్పెన్స్‌కు మేకర్స్ ఎప్పుడు తెరదించుతారో చూడాలి. భారీ పోటీ నుంచి తప్పుకుని మరో తేదీకి రావడం ద్వారా బాక్సాఫీస్ దగ్గర మెరుగైన వసూళ్లు సాధించాలని టీమ్ భావిస్తోందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email