‘రామాయణం’ ప్రమోషన్స్‌లో వివాదం..
9/11/2026

భారతీయ ఇతిహాసాల్లో ఎంతో పవిత్రమైన స్థానం సంపాదించుకున్న రామాయణం కథను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ ఇతిహాసం ఆధారంగా రూపొందిన సినిమా థాయ్‌లాండ్‌లో చేస్తున్న ప్రమోషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా కంటెంట్ కంటే ప్రచార కార్యక్రమంలో కనిపించిన కొందరు మోడల్స్ కారణంగా కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
థాయ్‌లాండ్‌లోని ఓ మీడియా స్క్రీనింగ్ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను సోనీ పిక్చర్స్ థాయ్‌లాండ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ కార్యక్రమంలో ముగ్గురు గ్లామరస్ మోడల్స్ ప్రత్యేకమైన దుస్తులు, భారీ ఆభరణాలతో దర్శనమిచ్చారు. స్వర్గలోకంలోని అప్సరసలను తలపించేలా వారి గెటప్స్ ఉండటంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే వీరు సినిమాలో నటించినవారు కాదు.. కేవలం ప్రమోషనల్ ఈవెంట్ కోసమే ఏర్పాటు చేసిన మోడల్స్.
ఈ ఫొటోలు బయటకు రావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రంభ, ఊర్వశి, మేనకలు రామాయణం ప్రమోషన్స్ కోసం భూమిపైకి వచ్చారా? అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే త్రేతాయుగంలోని ఇంద్రలోకపు అప్సరసలు గుర్తొస్తున్నాయంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ప్రచార విధానంపై మరో వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎంతో పవిత్రమైన రామాయణం వంటి ఇతిహాసాన్ని ప్రమోట్ చేసేందుకు ఇలాంటి గ్లామరస్ దుస్తుల్లో మహిళలను ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఆధ్యాత్మికత, సంప్రదాయాలకు సంబంధించిన కథాంశంతో రూపొందిన సినిమాకు ప్రచారం చేసే సమయంలో మరింత హుందాతనం, గౌరవం ఉండాలని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు థాయ్‌లాండ్‌లో ఈ సినిమా థియేటర్లతో పాటు ఐమ్యాక్స్ స్క్రీన్లలోనూ విడుదలైంది. థాయ్, హిందీ, తమిళ భాషల్లో ఆడియో వెర్షన్లు అందుబాటులో ఉండగా, డైరెక్టర్స్ కట్ వెర్షన్‌ను కూడా ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి భారీ విజువల్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న రామాయణం సినిమా ప్రమోషన్స్ మాత్రం ఇప్పుడు మరో చర్చకు తెరలేపాయి. సినిమాను ఎంత గ్రాండ్‌గా ప్రమోట్ చేసినా.. కథకు, దాని నేపథ్యానికి తగ్గట్టుగా ప్రచార కార్యక్రమాలు ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ వివాదంపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
