యంగ్ హీరోల కొత్త రూట్.. హీరోయిజం కంటే విలనిజానికే ఓటు!
9/11/2026

సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకోవడం ఒక ఎత్తయితే.. కెరీర్ ఆరంభంలోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం మరో ఎత్తు. ముఖ్యంగా హీరోలుగా ఎదగాల్సిన వయసులోనే పవర్ఫుల్ విలన్ పాత్రలకు ఓకే చెప్పడం అంటే మామూలు విషయం కాదు. కానీ మన యంగ్ యాక్టర్స్ మాత్రం ఇప్పుడు ఇదే బాటలో నడుస్తున్నారు. ఒకప్పుడు హీరోలుగా కనిపించిన కుర్రాళ్లు సైతం ఇప్పుడు విలనిజంతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకీ యంగ్ హీరోలను ఈ నెగిటివ్ రోల్స్ చేయటానికి ఇంట్రెస్ట్ కలిగిస్తోన్న కారణాలేంటి?
ప్రస్తుతం సినిమాల్లో హీరోతో పాటు విలన్ పాత్రకు కూడా భారీ ప్రాధాన్యత దక్కుతోంది. కొన్ని సందర్భాల్లో హీరో కంటే విలన్ పాత్రలే ఎక్కువగా గుర్తుండిపోతున్నాయి. కథలో బలమైన నెగిటివ్ క్యారెక్టర్ ఉంటే ఆ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్ వస్తోంది. దీంతో నటనకు కొత్త ఛాలెంజ్‌గా భావిస్తూ చాలామంది యువ నటులు విలన్ పాత్రల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ట్రెండ్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు నస్లీన్. ప్రేమలు సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న ఈ యంగ్ యాక్టర్.. సూర్య నటించిన 'సీన్' సినిమాలో సైకో విలన్‌గా కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. తనదైన నటనతో స్క్రీన్‌పై ప్రత్యేకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసి, నెగిటివ్ రోల్స్‌లోనూ తన సత్తా చాటుకున్నారు.
ఇక టాలీవుడ్లో కార్తికేయ కూడా విలన్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌తో ఆకట్టుకున్న ఆయన.. కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన వలిమైలోనూ తన విలనిజంతో మెప్పించారు. మరోవైపు విభిన్నమైన పాత్రలను ఎంచుకునే సుహాస్ కూడా సూర్య నటించిన 'మండాడి'లో నెగిటివ్ రోల్‌తో కొత్తగా కనిపించారు.
హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు సైతం ఈ విషయంలో ముందున్నారు. ప్రభాస్ నటించిన వర్షం హిందీ రీమేక్ ‘భాగి’లో స్టైలిష్ విలన్‌గా కనిపించి బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ పాత్రతో తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు. ఇక నెగిటివ్ క్యారెక్టర్స్ అనగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే పేరు రానా దగ్గుబాటి. బాహుబలిలో భల్లాలదేవగా ఆయన సృష్టించిన ప్రభావం అంతా ఇంతా కాదు. భారతీయ సినిమా చరిత్రలోనే గుర్తుండిపోయే విలన్ పాత్రల్లో అది ఒకటిగా నిలిచిపోయింది. బాహుబలితో పాటు మరికొన్ని సినిమాల్లోనూ ప్రతినాయకుడిగా తనదైన ముద్ర వేసిన రానా.. కథ డిమాండ్ చేస్తే ఎంత క్రూరంగా అయినా కనిపించగలనని నిరూపించారు.
ఈ జాబితాలోకి ఇప్పుడు మంచు మనోజ్ కూడా చేరిపోయారు. మిరాయ్, భైరవం వంటి సినిమాల్లో పవర్ఫుల్ నెగిటివ్ పాత్రలతో ఆకట్టుకున్న ఆయన.. సెకండ్ ఇన్నింగ్స్‌ను సరికొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘దాదా’ సినిమాలోనూ ప్రధాన విలన్‌గా కనిపించబోతుండటంతో ఈ పాత్రపై ఆసక్తి పెరుగుతోంది.
మొత్తానికి హీరోగా మాత్రమే కనిపించాలనే ఆలోచన నుంచి బయటకు వచ్చి, నటుడిగా తమ పరిధిని పెంచుకునేందుకు యంగ్ యాక్టర్స్ ప్రయత్నిస్తున్నారు. విలన్‌గా చేసినా సరే.. పాత్ర బలంగా ఉండాలి, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అందుకే ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ యంగ్ విలన్స్ హవా మొదలైంది. ఈ విలనిజం ట్రెండ్ ఇంకెంతమంది హీరోలను కొత్త అవతారంలో చూపిస్తుందో చూడాలి.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
