movies

‘మాతృభూమి’ క‌థ‌ను మార్చ‌లేదు.. వివాదాలపై సల్మాన్ ఖాన్ క్లారిటీ!

9/11/2026

‘మాతృభూమి’ క‌థ‌ను మార్చ‌లేదు.. వివాదాలపై సల్మాన్ ఖాన్ క్లారిటీ!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా టైటిల్ మార్పు నుంచి పాటల వివాదం, కథలో మార్పుల వరకు ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఒత్తిడితో సినిమా స్క్రిప్ట్‌ను మార్చారనే ప్రచారం బాలీవుడ్‌లో చర్చకు దారితీసింది. తాజాగా ఈ వార్తలపై సల్మాన్ ఖాన్ స్పందించి అసలు విషయాన్ని వెల్లడించారు. దర్శకుడు అపూర్వ లఖియా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తొలుత ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ అనే పేరుతో ప్రకటించారు. 2020లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన గల్వాన్ లోయ ఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే చైనాకు వ్యతిరేకంగా ఉన్న సన్నివేశాలను తొలగించాలని, కథలో మార్పులు చేయాలని ప్రభుత్వ వర్గాల నుంచి ఒత్తిడి వచ్చిందంటూ వార్తలు ప్రచారమయ్యాయి.

ఈ వార్త‌ల‌పై స‌ల్మాన్ ఖాన్ రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ ఒత్తిడితో స్క్రిప్ట్‌ను మార్చారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తమ సినిమా చైనాకు వ్యతిరేకంగా రూపొందుతున్నదనే ప్రచారం కూడా అవాస్తవమని అన్నారు. సైనికులు, వారి కుటుంబాలు ఎదుర్కొనే పరిస్థితుల చుట్టూనే కథ సాగుతుందని వివరించారు. యుద్ధం అంటే కేవలం రెండు దేశాల మధ్య పోరాటం మాత్రమే కాదని సల్మాన్ అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో సైనికులు ఎదుర్కొనే పరిస్థితులతో పాటు, వారి కోసం ఇళ్లలో ఎదురుచూసే కుటుంబాల బాధలు కూడా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలిపారు. ఇరువైపులా ఉండే సైనికులు తమ దేశం కోసం పోరాడుతారని, వారి కుటుంబాలకు ఉండే భావోద్వేగాలు కూడా ఒకేలా ఉంటాయని చెప్పారు. ఒక దేశాన్ని కించపరచడం లేదా మరో దేశంపై ప్రతికూలతను చూపించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

ఈ సినిమాలో ‘తేరి సెక్సీ బ్యూటీ’ అనే పాటను సల్మాన్ ఖాన్ స్వయంగా ఆలపించడం మరో విశేషం. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ గాయకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే యుద్ధ నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమాలో ఇలాంటి పాటను చేర్చడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ పాటకు సంబంధించిన చర్చ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’గా ప్రచారంలోకి వచ్చిన ఈ సినిమాకు చివరకు ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మొత్తానికి వివాదాలు, ప్రచారాల మధ్య సల్మాన్ ఖాన్ ఇచ్చిన వివరణతో ‘మాతృభూమి’ కథాంశంపై కొంత స్పష్టత వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email