movies

బాలీవుడ్ స్టార్స్‌తో పోటీగా బాక్సాఫీస్ బరిలో నాగచైతన్య ‘వృషకర్మ’

9/11/2026

బాలీవుడ్ స్టార్స్‌తో పోటీగా బాక్సాఫీస్ బరిలో నాగచైతన్య ‘వృషకర్మ’

టాలీవుడ్‌లో విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న చిత్రం ‘వృషకర్మ’. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ నెలకొంది. అయితే ఇప్పుడు ఈ మూవీ విడుదల తేదీ కారణంగా బాక్సాఫీస్ దగ్గర మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అదేంటంటే..డిసెంబర్ 4న ‘వృషకర్మ’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అదే రోజు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘మాతృభూమి’, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఈత’ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఒకే రోజు మూడు విభిన్నమైన కథాంశాలతో రూపొందిన సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలవబోతున్నాయి.

సల్మాన్ ఖాన్, శ్రద్ధా కపూర్ వంటి బాలీవుడ్ స్టార్స్ సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల వరకు వస్తే నాగచైతన్యకు ఉన్న మార్కెట్, ఫ్యాన్ బేస్ ‘వృషకర్మ’కు ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథాంశం, మేకింగ్ స్టైల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఓపెనింగ్స్ విషయంలో చైతూ సినిమా మంచి ప్రభావం చూపిస్తుందని ట్రేడ్ వర్గాల్లో అంచనాలు వినిపిస్తున్నాయి.

‘వృషకర్మ’ విషయానికి వస్తే.. ఇది సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాకుండా పీరియాడిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ప్రాచీన నమ్మకాలు, మిస్టరీ, అడ్వెంచర్ అంశాలతో దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ‘విరూపాక్ష’తో థ్రిల్లర్ జానర్‌లో తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన.. ఈసారి అంతకుమించిన కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నంలో ఉన్నారు. స్క్రిప్ట్, విజువల్స్, మేకింగ్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘మాతృభూమి’ 2020 గాల్వాన్ ఘర్షణ నేపథ్యంలో రూపొందుతున్న వార్ డ్రామా. శ్రద్ధా కపూర్ నటిస్తున్న ‘ఈత’ ప్రముఖ లావణి కళాకారిణి విఠాబాయి నారాయణ్‌గావ్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్. ఈ రెండు సినిమాల కథాంశాలు ‘వృషకర్మ’కు పూర్తి భిన్నంగా ఉండటం విశేషం.

మొత్తానికి డిసెంబర్ 4న బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన పోరు జరగబోతోంది. ఒకవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, మరోవైపు శ్రద్ధా కపూర్.. ఇంకోవైపు టాలీవుడ్ నుంచి నాగచైతన్య. మరి ఈ పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారు? ముఖ్యంగా ‘వృషకర్మ’తో చైతూ ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email