movies

పొలిటికల్ సపోర్ట్‌పై ధ‌నుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

9/11/2026

పొలిటికల్ సపోర్ట్‌పై ధ‌నుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

తమిళ స్టార్ హీరో ధనుష్ చుట్టూ గత కొంతకాలంగా రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారంతో పాటు, కొన్ని రాజకీయ శక్తుల మద్దతు ఉందంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన తదుపరి చిత్రం ‘ఓం’ ఆడియో వేడుకలో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

తన రాజకీయ రంగ ప్ర‌వేశం గురించి వస్తోన్న ప్రచారాలపై స్పందించిన ధనుష్.. తన జీవితాన్ని నడిపించేది దేవుడేనని, తన వెనుక అభిమానులు ఉన్నారని స్పష్టం చేశారు. తనకు ఎవరి అండదండలు అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. తన అభిమానులు తన కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వారి ప్రేమాభిమానాలే తనకు కొండంత బలమని పేర్కొన్నారు. అయితే సేవా కార్యక్రమాల కోసం కుటుంబ అవసరాలను పక్కనపెట్టి డబ్బు ఖర్చు చేయవద్దని అభిమానులకు సూచించారు. ఫ్యాన్స్ వారి కుటుంబాల‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీలున్నంత మేరకు ఇతరులకు సాయం చేయాలని కోరారు.

మరోవైపు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అభిమానులకు ధనుష్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు కురిసి ప్రజలు ఇబ్బందులు పడితే, వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కేవలం తన సినిమాలను ఆదరించడమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లోనూ అభిమానులు భాగస్వాములు కావాలని సూచించారు. ఇదిలా ఉంటే.. తన కెరీర్ గురించి కూడా ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఎప్పుడూ తక్కువ అంచనా వేస్తుంటారని, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారని అన్నారు. అయితే అలాంటి విమర్శలే తనకు మరింత ప్రేరణగా నిలుస్తాయని చెప్పారు. అండర్ డాగ్‌గా ఉండి విజయం సాధించడంలోనే అసలైన కిక్ ఉంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ధ‌నుష్ త‌న లేటెస్ట్ చిత్రం ‘ఓం’ గురించి మాట్లాడుతూ.. ఇది మల్టీస్టారర్ సినిమా మాత్రమే కాదని, ఐదుగురు హీరోలతో రూపొందుతున్న ప్రత్యేకమైన చిత్రమని పేర్కొన్నారు. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌తో పాటు తాను ఈ సినిమాలో కీలక భాగమని తెలిపారు. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామిపై ప్రశంసలు కురిపించిన ధనుష్.. ఆయనకు కథపై మంచి నమ్మకం ఉందని చెప్పారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ధనుష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే తన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా, ప్రస్తుతానికి తన దృష్టి సినిమాలపైనే ఉందనే సంకేతాలిచ్చారు. మరి రాబోయే రోజుల్లో ధనుష్ రాజకీయాలపై ఏదైనా స్పష్టత ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email