నాని హీరోగా మౌళి డైరెక్షన్లో మూవీ వస్తుందా!
9/11/2026

యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి.. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ హీరో మౌళి తనూజ్ ప్రశాంత్. ‘90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆయన.. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ‘దొంగ నా కొడుకు’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మౌళి చేసిన ఓ కామెంట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మౌళికి నేచురల్ స్టార్ నాని అంటే మొదటి నుంచీ ప్రత్యేకమైన అభిమానం. ముఖ్యంగా ‘పిల్ల జమీందార్’ సినిమా నుంచి నాని నటన, ఆయన సినిమాలు తనను బాగా ఆకట్టుకున్నాయని మౌళి పలు సందర్భాల్లో వెల్లడించారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాని ప్రయాణం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని చెబుతుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాని సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్లో నటించే అవకాశం వస్తే చేస్తారా? అని మౌళికి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. నాని బ్యానర్లో ఓ నటుడిగా సినిమా చేయడం కంటే.. భవిష్యత్తులో నానినే హీరోగా పెట్టి తాను ఓ సినిమా డైరెక్ట్ చేయాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు. అంటే తన అభిమాన హీరోతో దర్శకుడిగా పనిచేయాలనేది మౌళి మనసులో మాట అన్నమాట.
మొత్తానికి యూట్యూబర్‌గా మొదలైన మౌళి ప్రయాణం ఇప్పుడు హీరోగా కొనసాగుతోంది. మరి భవిష్యత్తులో మెగాఫోన్ పట్టుకుని తన అభిమాన హీరో నానిని డైరెక్ట్ చేసే స్థాయికి చేరుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం మౌళి హీరోగా నటించిన ‘దొంగ నా కొడుకు’ విడుదలకు సిద్ధమైంది. శ్రీను కంబాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సుష్మితా శెట్టి కథానాయికగా నటించగా.. అలీ, రజిత, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రైమ్, రాబరీ, కామెడీ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వార్తపై మీ స్పందన?
How did this story make you feel?
Loading reactions…
One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.
