movies

తలైవా సినిమాలో రామ్ పోతినేని..లీక్ అయిన వార్తే నిజం చేసిన స్టార్

9/11/2026

తలైవా సినిమాలో రామ్ పోతినేని..లీక్ అయిన వార్తే నిజం చేసిన స్టార్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అభిమానులకు దీపావళి సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘ధర్మాన్’లో రామ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ నటిస్తున్నాడంటూ వార్తలు ప్రచారంలోకి రాగా.. తాజాగా మేకర్స్ ప్రకటనతో వాటికి తెరపడింది. శ్రీలీల ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని ఇప్పటికే అధికారికంగా వెల్లడించిన టీమ్.. ఇప్పుడు రామ్ ఎంట్రీని కూడా కన్ఫర్మ్ చేసింది. దీంతో ఈ ప్రాజెక్టుపై సినీ అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.

ధర్మన్ మూవీ రామ్‌కు మరో ప్రత్యేకతను తీసుకొస్తోంది. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలు తమిళంలోకి డబ్ అయినప్పటికీ నేరుగా ఓ తమిళ సినిమాలో నటించడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ‘ది వారియర్’ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. అయితే ‘ధర్మాన్’తో రామ్ పూర్తిస్థాయి తమిళ సినీ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడంపై రామ్ పోతినేని సంతోషం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌ను చూసి తనకు సినిమాపై ప్రేమ పెరిగిందని, కమల్ హాసన్‌ను చూసి సినిమాపై గౌరవం ఏర్పడిందని పేర్కొన్నారు. అలాంటి ఇద్దరు దిగ్గజాలతో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్.మహేంద్రన్‌తో కలిసి నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనుండగా.. నయనతార, శ్రీలీల, రాశీఖన్నా, సిమ్రన్, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రామ్ పాత్ర వివరాలను మేకర్స్ వెల్లడించలేదు. అలాగే విడుదల తేదీపై కూడా స్పష్టత ఇవ్వలేదు. అయితే రజనీకాంత్‌తో రామ్ కాంబినేషన్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో అప్పుడే మొదలైంది.

మొత్తానికి.. టాలీవుడ్‌లో తన ఎనర్జీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రామ్.. ఇప్పుడు కోలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. మరి ‘ధర్మాన్’ ఆయనకు తమిళ ప్రేక్షకుల్లో ఎలాంటి గుర్తింపు తీసుకొస్తుందో చూడాలి.

ఈ వార్తపై మీ స్పందన?

How did this story make you feel?

Loading reactions…

One active choice per browser. Change it anytime. Repeated taps replay the animation while keeping one vote.

ఈ వార్తను షేర్ చేయండి

Share this article
Email